• ఆధునికం.. లాభాలు అధికం!
* రోజు 600 లీటర్ల పాల విక్రయం
* నెలకు రూ.6 లక్షల పైబడి ఆదాయం
* ఇష్టమైన వ్యాపకంలో యువరైతు విజయం
అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచిస్తున్నారు.. నేటి యువతరం రైతులు. ఈ కోవకు చెందినవారే రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం లింగారావు పల్లి గ్రామానికి చెందిన మిడుదుల వెంకటరెడ్డి.
ఈయన తొలుత అందిరిలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించారు. అది చిక్కకపోవడంతో కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఒకవైపు దీన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు తనకెంతో ఇష్టమైన డెయిరీ ఫారం స్థాపించి ఆవుల పెంపకం చేపట్టారు. సవ్యసాచిలా రెండు రంగాల్లోనూ రాణిస్తున్నారు. అధిక పాల దిగుబడులను సాధిస్తున్నారు. 2011లో ఎకరం విస్తీర్ణంలో రూ.40 లక్షలతో షెడ్డు నిర్మించి డెయిరీఫారం ప్రారంభించారు. పాల అమ్మకం ద్వారా ప్రస్తుతం నెలకు రూ.ఆరు లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు.
• సంరక్షణ చర్యలు
ఆవుల ఆరోగ్య పరిరక్షణకు.. అన్ని వేళలా అందుబాటులో ఉండేలా పశువైద్యుణ్ణి నియమించారు. ఆయన అక్కడే ఉంటూ ఆవులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఆవులను ఉదయం సాయంత్రం నీటితో కడుగుతారు. ఆవులు సేద తీరడానికి షెడ్‌లో నేలపై రబ్బర్ మ్యాట్‌లను అమర్చారు. ఇలా చేయడం వల్ల పొదుగుకు గాయాలు కావని తెలిపారు. గోమార్లు, పిడుదులు వంటివి వ్యాప్తి చెందకుండా ఎప్పడికప్పుడు మందులను పిచికారి చేస్తుంటారు. తాగు నీటి ద్వారా రోగాలు వ్యాప్తి చెందకుండా పశువులకు శుభ్రమైన నీటిని అందిస్తున్నారు.
• ఆవుల కొనుగోలు..
రైతు వెంకటరెడ్డి తొలినుంచి అధిక పాల దిగుబడినిచ్చే ఆవులపైనే దృష్టి సారించారు. ఇందుకు అనువైన సంకరజాతికి చెందిన హోల్‌స్టీన్ ఫ్రీజియన్ (హెచ్.ఎఫ్) ఆవులను తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేశారు. రకాన్ని బట్టి ఒక్కో అవును రూ.60 వేలు నుంచి రూ.లక్షా 13 వేలు వరకు కొనుగోలు చేశారు. ఏడాదికి నాలుగు చొప్పున ఆవులను మాత్రమే కొంటున్నారు. ప్రస్తుతం డెయిరీ ఫామ్‌లో 42 పాలిచ్చే ఆవులు, చూడివి 14, పెద్ద దూడలు 15, చిన్న దూడలు 12 ఉన్నాయి.
• పాల దిగుబడి..
ప్రస్తుతం ఒక్కో ఆవు నుంచి పూటకు సరాసరిన 8.5 లీటర్లు పాల దిగుబడి వస్తోంది. ఈ రైతు ఫారంలో గతంలో ఒక ఆవు పూటకు గరిష్ఠంగా 19.5 లీటర్ల వరకు పాలిచ్చింది. పశుగ్రాసం కొరత కారణంగా పాల దిగుబడి ఇటీవల కొంతమేర తగ్గింది. ఇప్పుడు రెండు పూటలా కలిపి 600 లీటర్ల పాల దిగుబడి తీస్తున్నారు. గతేడాది వేసవిలో గరిష్ఠంగా రోజుకు 1100 లీటర్ల పాల దిగుబడి పొందారు. ఈతకు రెండు నెలల ముందు నుంచి చూడి కట్టిన ఆవుల్లో పాలు తీయడం ఆపేస్తారు. ఇలా చేయడం వల్ల ఈనిన తర్వాత ఎక్కువ పాలిస్తాయంటున్నారు.
• పోషణ..
ఆవులకు పత్తి చెక్క, కంది చున్ని, మొక్కజొన్న పిండి, తవుడు కలిపిన మిశ్రమాన్ని దాణాగా అందిస్తున్నారు. ఈ దాణాను పాలిచ్చే ఆవుకు పూటకు నాలుగు కిలోలు, మిగిలిన ఆవులకు 2-3 కిలోలు చొప్పున అందిస్తున్నారు. పచ్చిమేతగా కో-4, కో-5 గ్రాసాన్ని ముక్కలుగా కత్తిరించి ఒక్కో ఆవుకు పూటకు 10 కిలోలు, సైలేజి చేసిన గ్రాసం 10 కిలోల చొప్పున రోజుకు 40 కిలోలు వరకు అందిస్తున్నారు. చలికాలంలో ఆవుల్లో పోషక లోపాలు తలెత్తకుండా ఉండేందుకు, వెన్నశాతం పెంచేందుకు.. ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఒక్కో ఆవుకు కాల్షియం లిక్విడ్ 100 మి.లీ., మినరల్ మిక్చర్ పొడి 50 గ్రాముల చొప్పున కుడితి నీళ్లలో కలిపి అందిస్తున్నారు.
• మంచి ఆదాయ వనరు
- మిడుదుల వెంకటరెడ్డి, రైతు
(చరవాణి : 94405 19687)
రైతులు వ్యవసాయంతో పాటు పాడి పెంపకం చేపడితే ఆదాయం బాగుంటుంది. పంటల ద్వారా వచ్చే నష్టాన్ని పాడి ద్వారా పూడ్చుకునే అవకాశం ఉంటుంది. అధిక పాలిచ్చే సంకరజాతి ఆవుల పోషణ లాభదాయకం. ఒకేసారి ఎక్కువ ఆవులను కొనకూడదు. దఫాలుగా ఆవుల సంఖ్యను పెంచుకుంటూ సాధకబాధకాలను అధ్యయనం చేయాలి. ఆవుల పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నాను. కేవలం వ్యాపార దృష్టితో, అధిక పాల దిగుబడే లక్ష్యంగా ఆవుల పెంపకం చేపట్టడం లేదు. వాటి ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాను.
• మేతగా సైలేజి
వేసవిలో పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ఉండేందుకు షెడ్‌కు దగ్గర్లో మూడు భారీ గుంతలను తీయించారు. దాదాపు 40 ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేస్తారు. ఈ పంటను పొట్ట దశలో కోసి, అనంతరం చాప్‌కట్టర్‌తో ముక్కలుగా కత్తిరించి సైలేజి రూపంలో గుంతల్లో నిల్వచేస్తారు. ఒక్కో గుంతను 80 అడుగుల పొడవు, 18 అడుగుల వెడల్పు, 10 అడుగుల లోతు కొలతలతో గుంతలను తీశారు. ఈ గుంతలోల కత్తిరించిన గ్రాసాన్ని ట్రాక్టర్‌తో తొక్కిస్తూ పొరలను నింపి, దాదాపు 900 టన్నుల గ్రాసాన్ని సైలేజి రూపంలో నిల్వ చేస్తారు. సైలేజి నాణ్యత పెంచేందుకు.. పొరలుగా వేసేటప్పుడు గ్రాసంపై ‘సైలేజి సేవర్ ఫ్లేవర్స్’ అనే ద్రావణాన్ని లీటరు నీటికి 100 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేస్తారు. మూడు నెలల పాటు సైలేజిని నిల్వచేసి తర్వాత వినియోగిస్తారు. ఎండుగడ్డి కోసం ఐదెకరాల్లో వరి సాగు చేస్తున్నారు.
ఎరువుతో ఆదాయం : ఏడాదికి దాదాపు 50-60 ట్రక్కుల ఎరువు వస్తుంది. ట్రక్కు రూ.2-3 వేలు చొప్పున విక్రయిస్తున్నారు. కొంతమేర తన పొలానికి ఎరువుగా ఉపయోగిస్తున్నారు. ఆవులను, షెడ్డును శుభ్రంచేసే నీటిని పశుగ్రాస క్షేత్రాలకు పారిస్తారు.
• ఖర్చు తక్కువ, ఆదాయమెక్కువ
సరాసరిన ఒక్కో ఆవుకు దాణా, మేత, కూలీలు.. వగైరా కలిపి రోజుకు దాదాపు రూ.250-300 వరకు ఖర్చవుతుండగా, పాల విక్రయం ద్వారా రూ.485 వరకు ఆదాయం ఉంటుంది. ఖర్చులు పోను ఒక్కో ఆవుపై సుమారు రూ.235 లాభం వస్తుంది. ఒక పశువైద్యులు, ఒక సూపర్ వైజర్‌తో కలుపుకొని మొత్తం 8 మంది ఇక్కడ పనిచేస్తున్నారు.
* పాల విక్రయం : పాలను జెర్సీ డెయిరీకి లీటరు రూ.33.67 చొప్పున విక్రయిస్తున్నారు. జెర్సీ ప్రతినిధులు షెడ్డు వద్దకు వచ్చి ఉదయం, సాయంత్రం పాలను తీసుకెళ్తున్నారు.
0 Comments