How to cultivate 22 crops in one care land

 ఎకరం భూమిలో 22 రకాల పంటల సాగు..



* మంచి ఆదాయం పొందుతున్న కడప జిల్లా రైతు
వ్యవసాయ శాఖ ప్రారంభించిన పల్లెజీవం పథకం
కరవు ప్రాంతాల రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. సేంద్రియ పద్ధతితో పాటు బహుళ పంటల సాగుతో మంచి ఆదాయం పొందుతున్నారు కడప జిల్లా కురువపల్లెకు చెందిన రైతు నాగరాజు. స్వల్పకాలిక పంటల నుంచి నిత్యం ఆదాయం పొందుతున్న ఆ రైతు ప్రస్థానం ఇది.

కడప జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లె గ్రామం కురవపల్లెకు చెందిన రైతు దేవరింటి నాగరాజు చిన్నతనం నుంచి వ్యవసాయం చేస్తున్నారు. వాణిజ్య పంటల సాగు లాభాలు ఇవ్వకపోగా నష్టాలను తెచ్చిపెట్టింది. దీంతో ఆయన ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించారు. ఈ లోగా వ్యవసాయ శాఖ పల్లెజీవం పథకం ప్రారంభించింది. చిన్న కమతాల్లో తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందేలా సన్న చిన్నకారు రైతులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఈ పథకం పట్ల నాగరాజు ఆకర్షితులయ్యారు. తనకున్న 1.10 ఎకరాల్లో ఆరు మాసాల క్రితం పల్లెజీవం పథకం కింద వివిధ పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ప్రధాన పంటగా కనకాంబరాలు సాగు చేశారు. అంతర పంటలుగా స్వల్పకాలిక పంటలైన కొత్తిమీర, గోంగూర, చిన్న ఉల్లిపాయలు, బంతి, కంది, బెండ, గోరుచిక్కుడు, చిక్కుడు, కాకర, బీర సాగు చేశారు. కంచెపంటగా ఆముదాల సాగు చేపట్టారు. దీర్ఘకాలిక పంటలుగా అల్లనేరేడు, పులుసు నిమ్మ, దానిమ్మ, సపోటా, కొబ్బరి, గంగనేరేడు వంటి పండ్ల మొక్కలతో పాటు అవిశ పంట సాగు చేపట్టారు.

ఈ పంటలన్నింటి సాగుకు కేవలం 18 వేల రూపాయల ఖర్చయింది. సాగు చేసిన స్వల్పకాలిక పంటల నుంచే పెట్టుబడి తిరిగి వచ్చిందన్నారు ఆ రైతు. బంతి పూలు విక్రయించగా రూ.15 వేలు, గోంగూరతో రూ.3 వేలు, కొత్తిమీరలో రూ.2 వేలు, చిక్కుడు, గోరుచిక్కుడులో రూ.5 వేలు, కాకర, బీరలలో రూ.1000 ఆదాయం వచ్చిందని వివరించారు. ప్రఽధాన పంట కనకాంబరం దిగుబడి ఇప్పుడిప్పుడే మొదలైందంటున్నారు. తొలి కోతలో రూ.750 వచ్చిందని, దీర్ఘకాలిక పంట కావడంతో రోజూ ఆదాయం ఉంటుందని ఆ రైతు వివరించారు. బహువార్షిక కంది సాగు చేపట్టానని, దీర్ఘకాలంలో కంది నుంచి కూడా ఆదాయం వస్తుందని ఆ రైతు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే పండ్లమొక్కలు పెద్దవైతే మంచి ఆదాయం వస్తుందన్నారు. అల్లనేరేడు కిలో రూ.100 పలుకుతుందని, నిమ్మ, దానిమ్మ, ఇతర పంటల నుంచి ఆదాయం రావడంతో పాటు ఇంటి అవసరాలకు పండ్లు కొనాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

గాలిలోని తేమ ఆధారంగా చేసే డ్రైసోయింగ్‌ సాగుకు ఎంతో లాభదాయకమని ఆ రైతు వివరించారు. అర ఎకరం పొలంలో జీరో బేస్డ్‌ వ్యవసాయం పల్లెజీవం పథకాల కింద డ్రైసోయింగ్‌ పంటలను సాగు చేశారు. ఇందులో జొన్న, కంది, గోంగూర, నువ్వులు... ఇలా తొమ్మిది రకాల విత్తనాలు విత్తారు. ప్రస్తుతం కొన్ని పంటలను నూర్పిడి చేయగా మరికొన్ని పంటలు సాగులోనే ఉన్నాయి. వర్షాలు లేని సమయంలో డ్రైసోయింగ్‌ విధానంలో సాగు ఎంతో లాభదాయకం అన్నారు నాగరాజు. ఒక బస్తా నువ్వులు, అర బస్తా జొన్న, అర బస్తా కందులు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు.

• కషాయాలతో మంచి దిగుబడి

ప్రకృతి విధానంలో పంటల సాగు ఎంతో లాభదాయకమన్నారు నాగరాజు. జీవామృతం, ఘన జీవామృతం, వేపపిండి కషాయం, పులసర చెక్క కషాయం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం, వాయిలాకు కషాయం వంటివి సొంతంగా తయారు చేసుకుని పంటలపై చల్లుతున్నట్లు ఆయన వివరించారు. పంటలకు చీడపీడలు రాకుండా ఈ కషాయాలు, జీవామృతాలు అద్భుతంగా పనిచేస్తున్నాయన్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంటలు పండించగలుగుతున్నానని ఆ రైతు చెప్పారు. తన పొలానికి ఉపయోగించగా మిగిలిన కషాయాలను ఇరుగు పొరుగు రైతులకు విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందడం ఈ రైతు ప్రత్యేకత.

• సేంద్రియ పంటలతోనే ఆరోగ్యం

ప్రకృతి విధానంలో పండించిన పంటలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. జీవామృతాలు, కషాయాలను ఉపయోగించి పండించిన పంటలు నాణ్యంగా, రుచికరంగా కూడా ఉంటాయి. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించేందుకు ఈ విధానం ఎంతగానో తోడ్పడుతుంది. ఈ విధానంలో సాగయిన పంటలు ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటాయి. రైతులంతా ప్రకృతి విధానంలో పంటలు సాగు చేస్తే ప్రజల ఆరోగ్యం మెరుగవడంతో పాటు రైతుల ఆదాయం కూడా రెండింతలవుతుంది.
- దేవరింటి నాగరాజు

Post a Comment

0 Comments