• పూల సాగు.. లాభాల గుబాళింపు
వర్షాభావం, సాగునీటి ఎద్దడి, భూగర్భజలాలు అంతంత మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేసి లాభాలు గడించడం సాధ్యం కాదన్నది చాలామంది రైతుల వాదన. కానీ ఈ యువకులు సుసాధ్యం చేసిచూపుతున్నారు. గ్రామ శివారులో భూగర్భజలాలు అంతంత మాత్రంగానే ఉండటంతో సాగుకు కష్టతరమైన తరుణంలో ఉన్న నీటినే సద్వినియోగం చేసుకుంటూ పూలసాగు చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి పొందుతూ పూలసాగును ఆదాయ మార్గంగా ఎంచుకుని నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు వారే బోధన్ మండలం ఫత్తేపూర్ గ్రామానికి చెందిన యువకులు ఖాజా, పోశెట్టి.
ఫత్తేపూర్‌కు చెందిన ఎస్‌కే ఖాజా నాలుగేళ్ల క్రితం ఆదిలాబాద్‌లో డీఈడీ చదువుతున్నప్పుడు తోటి స్నేహితుడు ఫయాజ్ వద్దకు వెళ్లగా వారి కుటుంబం పూల సాగు చేస్తున్న విధానంపై అధ్యయనం చేసి సాగు గురించి తెలుసుకున్నారు. అప్పుడే తాను కూడా పూలసాగు చేయాలన్న ఆకాంక్ష ఖాజాలో బలంగా నాటుకుంది. తల్లిదండ్రుల సహకారంతో వారికున్న వ్యవసాయ భూమిలో అరెకరం విస్తీర్ణంలో పూలసాగు కోసం కేటాయించి మొదలుపెట్టారు. నవంబరు ఆరంభంలో పూల మొక్కలు నాటాల్సి ఉంటుంది. నాటిన 40 రోజుల్లో చేతికందుతాయి. ఇలా నాలుగేళ్ల నుంచి పూల సాగు చేస్తున్నారు. నాన్న జలాల్‌తోపాటు కుటుంబసభ్యులంతా పూలతోట సాగు విధానంపై మంచి అవగాహన పెంచుకున్నారు. జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల పాటు పూలు చేతికొస్తాయి.
• రోజుకు 50 కిలోల వరకు దిగుబడి
గ్రామాన్ని ఆనుకుని ఉన్న తన సొంత అరెకరంలో చాందిని, తెల్ల, పసుపు వంటి మూడు రకాల చామంతులు సాగు చేస్తున్నారు. రోజూ సరాసరిగా 50 కిలోల వరకు దిగుబడి వస్తోంది. కోసిన పూలను బోధన్, నిజామాబాద్ పూలమార్కెట్‌కు తరలించి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో అన్ని ఖర్చులు మినహాయించి రోజుకు రూ.1500 వరకు మిగులు ఉంటుందని, పండగలు, శుభకార్యాలు, పెళ్లిళ్లున్నట్లయితే ఆదాయం మరింతగా ఉంటుందని ఖాజా పేర్కొంటున్నారు. చామంతి పూలసాగుపై వందరోజుల్లో లక్ష వరకు మిగులుబాటు ఉంటుందంటున్నారు.
• పుట్టగొడుగుల పెంపకం.. నిత్యం ఆదాయం
స్వయంకృషితో పాలపుట్టగొడుగులు పెంచుతూ లాభాలు ఆర్జిస్తున్నారు కృష్ణా జిల్లా మొవ్వ మండలం ఆవిరిపూడి గ్రామానికి చెందిన మేడిశెట్టి ప్రసన్న. ఆరోగ్యశాఖలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తూనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పుట్టగొడుగులు పెంచుతున్నారామె.
తక్కువ పెట్టుబడితో, కూలీల ఖర్చు లేకుండా పుట్టగొడుగుల్ని ఎవరైనా పెంచుకోవచ్చు. పట్టణాల్లో పుట్టగొడుగులకు మంచి గిరాకీ వుండటంతో మార్కెటింగ్ ఇబ్బందులు కూడా లేవు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలువురు పుట్టగొడుగులు పెంచుతూ ఆదాయం పొందుతున్నారు. తొలుత ఎండుగడ్డిని అంగుళం సైజులో ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అనంతరం గడ్డిని ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన గడ్డిని 20 శాతం తేమ ఉండే విధంగా ఆరబెట్టుకోవాలి. పాలిథిన్ కవర్లను సంచులుగా తయారుచేసుకుని ఆరబెట్టిన గడ్డిని ఐదు వరసలుగా నింపాలి. సంచుల్లో కొద్దిపాటి గడ్డివేసి దానిపైన విత్తనాలు, మరలా దానిపై గడ్డి, దానిపై విత్తనాలు ఇలా ఐదు వరసలుగా సంచిని నింపుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన సంచిని గాలి ఆడకుండా గట్టిగా మూసి ఉంచాలి. ఆ సంచికి 25 చిన్న చిన్న రంధ్రాలు పెట్టాలి. ఆ సంచులను 21 రోజులపాటు చీకటి గదిలో ఉంచాలి. పుట్టగొడుగుల తయారీలో భాగంగా మట్టిని సేకరించి దానిని నానబెట్టి తర్వాత ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన మట్టిలో చాక్ పౌడర్ కలపాలి. తదుపరి డార్క్ రూమ్‌లో ఉంచిన బ్యాగులను 21 రోజుల తర్వాత బ్యాగును సగానికి కట్ చేసి తయారుచేసుకున్న మట్టిని నింపాలి.
అనంతరం ఈ బ్యాగులను వెలుతురు గదుల్లోకి మార్చాలి. 24 గంటల గడిచిన తర్వాత రోజుకు రెండుపూటలా పల్చగా తడుపుతూ ఉండాలి. 15 రోజులకు పుట్టగొడుగులు మొలకెత్తుతాయి. ఈ ప్రక్రియ మొత్తంలో 40 రోజులకు పుట్టగొడుగులు పూర్తిస్థాయిలో తయారవుతాయి. తయారైన పుట్టగొడుగులు రెండు నెలలపాటు కోసుకోవచ్చు. కేజీ విత్తనాలతో ఐదు కిలోల పుట్టగొడుగులు తయారవుతాయి. తయారైన పుట్టగొడుగులను ఆన్‌లైన్ ద్వారా కిలో రూ.200లకు హైదరాబాద్, కాకినాడ, విజయవాడలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలుదారులు తమ అకౌంట్‌లో ముందుగానే డబ్బులు వేస్తారని, అనంతరం వారి అడ్రస్ ప్రకారం సరుకులు పంపిస్తామని తెలిపారు.
• నెలకు 20 వేల ఆదాయం
కూలీలపై ఆధారపడకుండా కుటుంబసభ్యులే పనిచేసుకుంటే నెలకు రూ.20 వేల వరకు ఆదాయం లభిస్తున్నది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఎక్కువ విస్తీర్ణంలో పుట్టగొడుగుల పెంపకాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నాను. - ప్రసన్న
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 40 శాతం పైగా ఆదాయం తెచ్చిపెడుతున్న ఆక్వా సాగు హైటెక్ పోకడలు పోతున్నది. చెరువుల తవ్వకం నుంచి చేపల ఎదుగుదల తీరుతెన్నులను పరిశీలించే వరకు అన్ని పనులూ ఆధునిక యంత్ర పరికరాల సాయంతో నిర్వహిస్తున్నారు ఆక్వా రైతులు.
చెరువుల తవ్వకం దగ్గర నుంచి నీరు పెట్టడం, ఫీడు వేయడం, వాటికి ఆక్సిజన్ అందించడం, చెరువును శుభ్రం చేయడం, చెరువులో ఉన్న రొయ్యలు, చేపల తీరుపై నిఘా పెట్టడం, ఎప్పటికప్పుడు ఆక్సిజన్ ఎలా ఉందో, ఉదజని ఏ మేరకు ఉందనేది కూడా ఆధునిక యంత్ర పరికరాల ద్వారా చూసే వీలు కలిగింది. చేపల చెరువు వద్ద అనేక పనులను రైతు సెల్‌ఫోన్ ద్వారా కూడా ఇంటి దగ్గరవుండి పనులు పూర్తి చేసుకోవడం విశేషం. విదేశాల్లో తయారైన ఈ యంత్రాలు ఇప్పుడు గోదావరి జిల్లాల్లో మారుమూల పల్లెల్లో సైతం దర్శనం ఇస్తున్నాయి.
* నాన్‌రాంగ్ ఏరియేటర్ :
నాన్‌రాంగ్ ఏరియేటర్ ద్వారా ఆక్సిజన్ రొయ్యకు సులభంగా అందుతుంది. వీటిని చెరువులో ఎక్కడైనా అమర్చుకుని పని చేయించుకోవడానికి వీలుంది.
* లాంగ్ అలారమ్ :
ఈ లాంగ్ అలారమ్ ఏరియేటర్‌తో కూడా ఆక్సిజన్‌ను అందిస్తున్నారు. అయితే ఇది ఒక ప్రాంతంలో మాత్రమే అమర్చుకోవడానికి అవకాశం వుంది. దీని నుంచి ఆక్సిజన్ పెద్ద మొత్తంలో ఉత్పత్తి అవుతుంది.
* బ్లోయర్ ఏరియేషన్ :
ఈ యంత్ర పరికరాన్ని హేచరీలో మాత్రమే వాడేవారు. ఇప్పుడు ఆధునిక పద్ధతిలో చెరువు మొత్తం ఏరియేటరు లేకుండా పైపు ద్వారా ఏరియేషన్(పైపు ద్వారా ఆక్సిజన్) అందిస్తారు.
* చెరువు లోపల కలియతిరిగే ఏరియేటర్లు :
చెరువులో రొయ్య, చేపలు కొన్ని సందర్భాల్లో ఒకేచోట గుంపులు గుంపులుగా ఉంటాయి. ఆ సమయంలో, ఆ ప్రాంతంలో ఆక్సిజన్ తక్కువ మొత్తంలో ఉంటుంది. ఆ సమయంలో ఈ కలియతిరిగే ఏరియేటర్ ద్వారా వాటికి ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుంది.
* ఆటోమేటిక్ ఫీడర్(మేత వేసేది) :
చెరువులో మేతలు వేయడానికి ఇంతవరకు మనుషులను వినియోగిస్తున్నారు. అయితే గత నాలుగైదు సంవత్సరాలుగా కూలీల కొరత ఏర్పడటంతో ఈ ఆటోమేటిక్ ఫీడర్‌ను తెర పైకి తెచ్చారు. దీని ద్వారా మనిషి సాయం లేకుండా యంత్రం సాయం ద్వారా మేత వెదజల్లొచ్చు. మేత వేసే సమయంలో కరెంట్ లేకపోయినా సోలార్ విద్యుత్‌తో కూడా పనిచేసి మేతను సకాలంలో వేసే సోలార్ ఫీడర్‌ను రైతులు ఉపయోగిస్తున్నారు.
0 Comments