కొమ్మకొమ్మకో రుచి!
బంగినపల్లి, రసాలు, దశేరి, ఆల్ఫాన్సో... అన్నీ మామిడి పళ్లే అయినా, ఒక్కో రకానిది ఒక్కో రుచి. దేని ప్రత్యేకత దానిదే. అయితే... ఇవన్నీ ఒకే చెట్టుకు కాయడం చూశారా..? చూడలేదా..? అయితే మీరు కృష్ణాజిల్లాలోని వడ్లమాను వెళ్లాల్సిందే.
అక్కడ ఒకే చెట్టుకు భిన్న రకాల కాయలు కనిపించి ఆశ్చర్యపరుస్తాయి, ఆపైన నోరూరిస్తాయి.
కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానుకి చెందిన రైతు కుప్పాల రామగోపాలకృష్ణ రెండేళ్ల కిందటి వరకూ ఓ సాధారణ రైతు. ఇప్పుడు ఒకే చెట్టుకు 24 రకాల మామిడి రకాల్ని అంటుకట్టిన అద్భుత రైతు. తండ్రి వెంకటేశ్వరరావు మామిడి సాగుచేస్తుంటారు. తండ్రికి సాయంగా ఉంటూ సాగులో కొత్త పద్ధతుల్ని తెలుసుకోడానికి ఆసక్తి చూపేవాడు రామగోపాల్. ఆ క్రమంలో వెంకటాయపాలెం గ్రామానికి చెందిన సుదిమెళ్ల లక్ష్మీనారాయణ వద్ద అంటుకట్టడం నేర్చుకున్నాడు. ఒక దశలో సాగు లాభసాటిగా లేదని తోటను లీజుకు ఇచ్చి తమ కుటుంబం కోసం ఒక చెట్టుని మాత్రం ఉంచాలనుకున్నారు వెంకటేశ్వరరావు. ‘ఆ ఒక్క చెట్టుకీ వివిధ రకాల కొమ్మల్ని అంటుకడితే... అన్ని రకాల పళ్లూ తినొచ్చుగా’ అన్న ఆలోచన వచ్చింది రామగోపాల్‌కి. తోటి రైతులు... ‘అంట్లు అందరూ కడతారు.. కానీ, వాటిని పెంచడం పెద్ద చేయడం కష్టం’ అనడంతో దీన్నో సవాలుగా తీసుకున్నాడు రామగోపాల్.
• ఎలా సాధ్యమైందంటే... !
రామగోపాల్ కుటుంబానికి ఏడెకరాల్లో మామిడి తోటలున్నాయి. అందులో కలెక్టర్, చిన్నరసం, బంగినపల్లి రకాల చెట్లు మాత్రమే ఉన్నాయి. 350 చెట్లలో వంద చెట్లు నాటు రకం ఉన్నాయి. తొలిగా ఆరేళ్ల వయసున్న ‘చిన్నరసం’ చెట్టుకు నాలుగేళ్ల కిందట వివిధ రకాల చెట్ల కొమ్మల్ని తెచ్చి అంటుకట్టడం ప్రారంభించాడు. వాటిలో కొన్ని రెండేళ్లకే కాయలు కాశాయి. దాంతో మొత్తం 24 రకాల్ని అంటుకట్టాడు. తన ప్రయోగం సత్ఫలితాలు ఇవ్వడంతో... తోటలోని నాటు రకం చెట్లకీ నాలుగైదు రకాల్ని అంటుకట్టాడు. 24 రకాలు అంటుకట్టిన చెట్టు గతేడాది 18 రకాల కాయలు కాయగా, ఈ ఏడాది 14 రకాలు కాసింది. ప్రారంభంలో హెచ్చుతగ్గులు వచ్చినా చెట్టు పెరిగేకొద్దీ అన్ని రకాలూ పండతాయంటాడు రామగోపాల్. సాధారణంగా కట్టిన అంట్లన్నీ బతకవు. అంటు కట్టిన మండ కాకుండా పెద్ద చెట్టు ఆకులే పెరుగుతుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు విరిచేస్తూ, అంటు కట్టిన కాండం మాత్రమే పెరిగేలా చూసుకోవాలి. రామగోపాల్... రోజూ చెట్లను పర్యవేక్షిస్తూ తల్లి చెట్టు కాండాలను జాగ్రత్తగా తొలుచుకుంటూ అంటు చెట్లు చిగురించేలా చేశాడు. ఒక్కో రకమూ నిలిచేసరికి తన శ్రమ ఫలించినందుకు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అంటుకట్టిన వాటిలో... దశేరి, చెరకు రసం, సొర మామిడి, బంగినపల్లి, ఆల్ఫాన్సో, పంచదార కశం, మల్లిక, సువర్ణ రేఖ, జలం, కేసరి, కలెక్టర్, పునాస, పండూరి పండు, కొత్తపల్లి కొబ్బరి, నూజివీడు తియ్య మామిడి... తదితరాలు ఉన్నాయి. గత ఏడాది దిల్లీలో జరిగిన ‘కృషి ఉన్నత మేళా’లో, గుంటూరులో జరిగిన ప్రకృతి వ్యవసాయ సభల్లో తాను పండించిన 18 రకాల మామిడి రకాలను ప్రదర్శించాడు రామగోపాల్. గుంటూరులో ఇతడి ప్రదర్శనను చూసిన ఇండోనేషియా అధికారుల బృందం... మరుసటి రోజే తోటకు వచ్చి సాగు వివరాలు తెలుసుకుంది. అప్పటి కలెక్టర్ లక్ష్మీకాంతం తోటకు వెళ్లి రామగోపాల్‌ని అభినందించారు. ఈ రైతు గురించి విన్నవాళ్లు తోటకి వెళ్లి చెట్లని చూసి, పనిలో పనిగా కాయల్నీ కొంటున్నారు.
• సేంద్రియ సాగు...
కాయ సైజు పెరుగుతుందని తోటకు ఎక్కువగా నీళ్లు పెడతారు చాలామంది. కానీ రామగోపాల్ ఏడాదిలో ఒక్క తడి మాత్రమే పెడతారు. దానివల్ల కాయ సైజు పెరగకున్నా, రుచి పెరుగుతుందంటాడు. పురుగుల మందులకు బదులు పాలేకర్ పద్ధతులు పాటిస్తున్నాడు. ముందుగా 12 ఆకులతో దశపరిణి కషాయం తయారుచేసి, చెట్లకు స్ప్రే చేస్తాడు. రెండోదశలో పుల్లటి మజ్జిగ, ఆ తర్వాత రకరకాల ఆకులను కుళ్లబెట్టి తయారుచేసిన కషాయం, ఆపైన పుట్టమట్టిని తీసుకొచ్చి జల్లుతారు. పురుగులు ఈ మన్ను బాగా తిని, పొట్ట ఉబ్బి చనిపోతాయి. నేల సారానికి పచ్చిరొట్ట ఎరువులు, ఘన జీవామృతం వాడుతున్నాడు. వీటివల్ల సాగు ఖర్చు సగం మేర తగ్గిందంటాడు. రామగోపాల్న్‌ి చూసి ఇతర రైతులూ ప్రకృతి సేద్యం చేస్తున్నారు, చెట్లకి అంట్లు కడుతున్నారు. ‘ఎంత కష్టపడినా మార్కెట్‌లో రేటు ఉండటంలేదు. పంటకు గిట్టుబాటు ధర అందితేనే రైతు తన కాళ్లమీద నిలబడేది’ అంటాడీ ఆదర్శ రైతు.
0 Comments