Lotus farmer success story

 తామర పూల సాగు:



ఆలయానికి వెళ్లి నిండు మనసుతో దేవుడిని కొలుస్తాం. పూలూపండ్లూ అర్పించి కోరిన కోరికలను తీర్చమంటూ వేడుకుంటాం. పూజాకార్యక్రమాల్లో పూలది ఇంత విశిష్ట స్థానం కనుకనే ఎంతో మంది రైతులు పూలసాగును ఉపాధిగా ఎంచుకుని ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అలాగే కేరళ రాష్ట్రంలోని ఓ గ్రామానికి చెందిన ముస్లింలు తామర పూల సాగును చేపట్టి, వాటిని ఆలయాలకు సరఫరా చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు.

 

కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లా తిరునావాయా గ్రామంలో ఎక్కువగా నివసించేది ముస్లిం కుటుంబాలే. ఇదే గ్రామ శివారులో నవముకుంద అనే విష్ణు ఆలయం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ఆ ఆలయానికి వచ్చే భక్తులు విష్ణువుకు ప్రీతిపాత్రమైన తామర పూలూ, దండలూ సమర్పిస్తూ పూజలు చేస్తుంటే, అర్చకులు వాటితో ఆలయాన్ని అలంకరిస్తుండేవారు. ఆ గ్రామ ముస్లింలు తిరునావాయా చుట్టుపక్కలున్న చెరువుల్లోంచి తామర పూలను సేకరించి ఆలయం వద్ద భక్తులకూ, అర్చకులకూ విక్రయిస్తుండేవారు. అయితే, వేసవిలో నీరు లేక చాలా సార్లు పూలకు కొరత ఏర్పడేది. దీంతో వారు మోటార్లతో తమ వ్యవసాయ భూముల్లో నీటిని నింపి వాటినే కొలనులుగా మార్చేశారు. అందులో తామర విత్తనాలు చల్లి తామర సాగును ప్రారంభించారు.

 

ఏ కాలంలోనైనా ఈ పూలు దొరుకుతాయన్న ఉద్దేశంతో పలు ప్రాంతాల్లోని ఆలయాల నిర్వాహకులూ, వ్యాపారులూ, భక్తులూ తిరునావాయాకు వచ్చి కొనుగోలు చేయసాగారు. అలా తామర పూలకోసం వచ్చే వారి సంఖ్య ఏటేటా పెరగడంతో అక్కడి ముస్లింలు వాటినే గత యాభై ఏళ్లుగా సాగుచేస్తూ పలు ప్రాంతాల్లోని ఆలయాలకు చేరవేస్తున్నారు.

* పదిహేను వందల ఎకరాల్లో...

తిరునావాయా గ్రామానికి చెందిన ముస్లింలు ప్రస్తుతం పదిహేను వందల ఎకరాల విస్తీర్ణంలో తామర పూలను సాగు చేస్తున్నారు. గ్రామశివారులోని చెరువుల్లో ఓ వైపు సాగుచేస్తూనే మరోవైపు వీటికోసం తమ సొంత భూములనూ, లీజుకు తీసుకున్న స్థలాలనూ కొలనులుగా మార్చడం గమనార్హం. వీటి సాగు కోసం విత్తనాలను కొనుగోలు చేసి చెరువుల్లోనూ, కొలనుల్లోనూ చల్లుతారు. విత్తనాలు చల్లిన తరవాత మూడు నెలల నుంచీ నాలుగు నెలలలోపు పూలు చేతికొస్తాయి. వీటిని తిరుచ్చూరు, గురువాయూర్‌తోపాటు చెన్నై, బెంగళూరు, కోయంబత్తూర్‌లోని ప్రధాన ఆలయాలకూ, అక్కడి వ్యాపారులకూ సరఫరా చేస్తున్నారు. రోజూ ఏడు వేల నుంచీ ఎనిమిది వేల పూలను ప్రత్యేక వాహనాల్లో ఆయా ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా తిరుచ్చూరు, గురువాయూర్‌ ప్రాంతాల్లోని అర్చకులు తిరునావాయా గ్రామ ముస్లింలు పంపించిన తామర పూలతోనే ఆలయాలను అలంకరించి పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు.

 

• ప్రధాని ప్రశంసలు

ప్రధానిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా నరేంద్రమోదీ గురువాయూర్‌లోని శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఆ సమయంలో... తిరునావాయాలో సాగుచేసిన తామర పూలతోనే మోదీకి అర్చకులు తులాభారం నిర్వహించారు. హిందువుల పూజలూ, ఆలయాల అలంకరణ కోసం తామర పూలను సాగుచేస్తున్న ఆ గ్రామ ముస్లింలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు కూడా.

 

ఒక్కో పువ్వును రెండు రూపాయల నుంచీ అయిదు రూపాయల వరకూ విక్రయిస్తున్న ముస్లింలు ప్రతి నెలా సుమారు రూ.30 వేలు సంపాదిస్తున్నారు. వీరు తామర సాగుతో లాభాలను పొందుతూనే పూలు తెంపడం, మాలలను అల్లడంలాంటి పనులను అప్పగిస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. తిరునావాయాలో సాగైన తామర పూలను భక్తులూ, అర్చకులూ ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తారనీ, తాము సాగు చేసిన పూలు దైవసన్నిధికి చేరడం ఎంతో ఆనందంగా ఉంటుందనీ చెబుతారు ఆ గ్రామ ముస్లింలు.

Post a Comment

0 Comments