Anjura fruits farming by young farmer

 • అంజూర సాగులో.. యువరైతు ఆదర్శం!




ఉన్నత చదువులు చదివిన కొంతమంది యువకులు వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. వీరు ఇతర రైతుల్లా కాకుండా సాగులో నూతన ఒరవడిని సృష్టిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ.. సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన యువరైతు కట్ల శ్రీనివాస్‌ అంజూర సాగు చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు.




• ఆలోచన ఇలా..!


గతంలో.. తన తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం వైద్యులు పండ్లను తినమని సిఫారసు చేశారు. మార్కెట్లో ఎక్కువగా రసాయనాలతో పండించిన పండ్లే ఉండటంతో.. సేంద్రియ పద్ధతిలో పోషకాలున్న పంటల సాగు ప్రయోజనకరమని భావించారు. యూట్యూబ్‌, అంతర్జాలంలో శోధించి, అంజూర సాగుకు నిర్ణయించారు. ఉద్యోగానికి స్వస్తి పలికి, రెండున్నర ఎకరాల్లో సాగును మొదలు పెట్టారు. దక్షిణ కొరియాకు చెందిన ‘డాక్టర్‌ చోహన్‌క్యు ప్రకృతి విధానం’లో పంటను సాగు చేస్తున్నారు. వరుసల మధ్య 12 అడుగులు, మొక్కల మధ్య 8 అడుగుల ఎడంతో గుంతలు తీశారు. ప్రతి గుంతలో పది కిలోల పశువుల ఎరువు, 200 గ్రా. కొబ్బరిపొడితో పాటు 100 గ్రా. వేపపిండి వేశారు. గుంతలో వేసిన ఎరువులు మాగిన తర్వాత, గతేడాది మార్చిలో ఎకరానికి 400 మొక్కల చొప్పున నాటారు. మొక్కలను నాటారు. బిందుసేద్యం ద్వారా నీరందిస్తున్నారు. ఈ పరికరాలను ఉద్యానశాఖ నుంచి 90 శాతం రాయితీపై పొందారు.


* మొక్కల కొనుగోలు : పోషకాలు అధికంగా ఉండే ‘టర్కీ బ్రౌన్‌’ రకం అంజూర మొక్కలను రాయచూర్‌లోని ఓ రైతు దగ్గర ‘గూటి పద్ధతి’లో (ఎయిర్‌ లేయరింగ్‌) పెంచిన మొక్కలను (ఒక్కో మొక్క రూ.40 చొప్పున) కొనుగోలు చేశారు. ఒక్కో కాయ 60 నుంచి 90 గ్రా. బరువుంటుంది. మిగతా రకాల కన్నా వీటి రుచి బాగుంటుందన్నారు.


* సాగు ఖర్చు : రెండెకరాల్లో పంట సాగుకు.. మొక్కల కొనుగోలుకు రూ.40 వేలు, దుక్కి దున్నటానికి రూ.5 వేలు, పశువుల ఎరువుకు రూ.20 వేలు, జీవన ఎరువులు రూ.2 వేలు, మొక్కలు నాటేందుకు కూలీలకు రూ.3 వేలు చొప్పున ఖర్చయింది.




• సస్యరక్షణ చర్యలు..


* సేంద్రియ పదార్థాలతో కషాయాలను తయారుచేసి పిచికారీ చేస్తున్నారు. ముఖ్యంగా నేలలోని సేంద్రియ పదార్థాలు కుళ్లి, మొక్కలకు పోషకాలు అందించేందుకు.. ట్రైకోడెర్మా విరిడి, అజటోబాక్టర్‌, మైకోరైజా వంటి జీవన ఎరువులను గుంతల్లో వేశారు.


* తెగుళ్ళ నివారణకు ‘వేస్ట్‌ డీకంపోజర్‌’ ద్రావణం తయారు చేసి, అందులో పంచగవ్య కషాయాలను కలిపి పంటపై పిచికారీ చేస్తున్నారు.


* దోమ నివారణకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1.5 లీటర్ల వేపనూనె + 100 మి.లీ. సాండోవిట్‌ చొప్పున కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు.


* కాయలపై పగుళ్ల నివారణతో పాటు కాయసైజు పెరిగేందుకు లీటరు నీటికి 5 గ్రా. కొబ్బరినూనె + అర మి.లీ. సాండోవిట్‌ కలిపి పిచికారీ చేస్తున్నారు.


* తుప్పు తెగులు (శీతాకాలంలో ఎక్కువగా వస్తుంది) నివారణకు.. లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున హెక్సాకొనజోల్‌ కలిపి నాటిన మూడో నెలలో పిచికారీ చేశారు. తర్వాత దశ నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి.. ఎకరానికి 200 లీటర్ల నీటిలో పంచగవ్య 6 లీటర్లు, బయోకల్చరు 2 లీటర్లు చొప్పున కలిపి మొక్కల మొదళ్ల వద్ద అర లీటరు చొప్పున పోస్తున్నారు. ఇదే ద్రావణాన్ని పూతదశ నుంచి కాయకోత పూర్తయ్యే వరకు ప్రతినెలా మొక్కలపైనా పిచికారీ చేస్తున్నారు.


* అన్ని రకాల పాకే పురుగుల నివారణకు.. ‘రెడువిడ్‌ బగ్‌’ (ఆడ, మగ పురుగులు) అనే మిత్ర పురుగులను రెండు జతలు తెచ్చి చెట్లపై వదిలారు. వీటిని హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనెజ్‌మెంట్- ఎన్‌ఐపిహెచ్‌ఎం’ వారు ఉచితంగా ఇచ్చారు. ఇవి మొక్కలపై సంతతిని పెంచుకొని పంటకు హానిచేసే ఇతర పురుగులను చంపుతాయి.




* పక్షులు కాయలను నష్టపరచకుండా ఉండేందుకు.. తోటపై వల (నెట్‌) వేశారు. ఇందుకు రెండున్నర ఎకరాలకు రూ.70 వేలు ఖర్చు చేశారు (రాయితీ లేదు). దీనిని కైకలూరులో 73 కిలోల.. కిలో రూ.550 చొప్పున కొనుగోలు చేశారు. వలను తోటలపై పరచడానికి అవసరమైన బొంగులు (కర్రలు) రూ.15 వేలుతో పాటు కూలీలకు రూ.15 వేలు ఖర్చైంది.


• ఆముదం నూనెతో ద్రావణం తయారీ


* మొక్కల ఎదుగుదల కోసం 200 లీటర్ల నీటిలో.. 200 కోడిగుడ్లు, 10 లీటర్ల ఆముదం నూనె, లీటరు ఎమల్సిఫయర్‌ కలిపిన మిశ్రమాన్ని మొక్కల మొదళ్ల వద్ద ప్రతి మొక్కకు అర లీటరు చొప్పున పోస్తున్నారు.


* దిగుబడి..


నాటిన పది నెలల నుంచే కాపు వస్తుంది. ఏడాదిలో 6-8 నెలలపాటు దిగుబడి లభిస్తుంది. తోట పదేళ్ల వరకు మంచి ఫలసాయం ఇస్తుంది. ప్రతిరోజు ఎకరానికి 10 కిలోల చొప్పున దిగుబడి వస్తుంది. రెండో ఏడాది నుంచి ఎకరానికి రోజూ 30 కిలోల దిగుబడి వస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు 400 కిలోల దిగుబడి వచ్చిందన్నారు. గతేడాది తోటలో సాళ్ల మధ్య ఖాళీలో నువ్వు సాగుచేసి రూ.20 వేలు అదనపు ఆదాయం పొందారు. ఇంటి అవసరాల కోసం అంతరపంటగా కూరగాయలు సైతం సాగు చేస్తున్నారు.


* మార్కెటింగ్‌..


పండించిన పంటను స్థానికులకు ఇంటి వద్దే కిలో (బాక్సుల్లో) రూ.140 చొప్పున విక్రయిస్తున్నారు. కోసిన కాయలపై ఇతరత్రా బ్యాక్టీరియా, వైరస్‌ల నివారణకు.. 4 లీటర్ల నీటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ చొప్పున తెల్ల వెనిగర్‌ కలిపిన ద్రావణంలో కాయలను ముంచి ఆరబెట్టి ప్యాక్‌ చేస్తున్నారు. నాణ్యత బాగుండటంతో కాయల కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. కాయలు తినడం వల్ల వచ్చే ప్రయోజనాలను బాక్సులపై అతికించి, వినియోగదార్లకు అవగాహన కలిగిస్తున్నారు.

Post a Comment

0 Comments