బంగాళదుంప స్వల్పకాలంలో తక్కువ కాలంలో పండే శీతాకాలపు పంట. మన రాష్ట్రంలో షుమారు 6637 హెక్టార్లలో 1,32,740 టన్నుల ఉత్పత్తిచేయబడుతోంది. రాష్ట్రంలో ముఖ్యంగా మెదక్, చిత్తూరు జిల్లాల్లో అధికంగా, రంగారెడ్డి జిల్లాలో కొద్దిపటి విస్తీర్ణంలో సాగులో వుంది.
వాతావరణం:
చల్లని వాతావరణం అవసరం. పగటి ఉష్ణోగ్రత 32° సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 15-200 సెల్సియస్ మధ్య చాలా అనుకూలం. అధిక ఉష్ణోగ్రతలో దుంపల పెరుగుదల వుండదు.
నేలలు:
నీటిపారుదల మరియు మురుగు నీటి వసతిగల ఇసుక లేక ఎర్రగరప నేలలు అనుకూలం. పి.హెచ్. 5.2-7 వుండి ఆమ్ల లక్షణాలు గల నేలలు, బరువైన నేలలు దుంపల పెరుగుదలకు అనుకూలం కాదు.
పంటకాలం:
రబీ కాలం సాగుకు అనుకూలం. అక్టోబరు రెండవ పక్షం నుండి నవంబరు మొదటి వారం వరకు నాటుకోవచ్చు. కొన్ని పరిస్థితులలో ఖరీఫ్ పంటలు దెబ్బ తిన్నప్పుడు సెప్టెంబరు ఆఖరులో కూడా నాటుకోవచ్చు.
రకాలు:
కుఫ్రీ లాలిమ:
మొక్కలు మధ్యస్థ పొడవుతో, ఆకుపచ్చ ఆకులు కలిగి వుంటాయి. దుంపలు మధ్యస్థంగా, గుండ్రంగా లేత ఎరుపు రంగులో వుంటాయి. 90-140 రోజుల్లో కోతకు వచ్చి, ఎకరాకు 11-12 టన్నుల దిగుబడినిస్తుంది.
కుఫ్రీ బాద్‌షా:
మొక్కలు మధ్యస్థ పొడవుగా వుండి పాకే లక్షణం కలిగి వుంటాయి. ఆకులు లేత ఆకుపచ్చ రంగులో వుంటాయి. దుంపలు మధ్యస్థంగా వుండి, గుండ్రంగా తెల్లగా వుంటాయి. 90-140 రోజుల్లో కోతకొచ్చి ఎకరాకు 10-11 టన్నుల దిగుబడినిస్తుంది.
కుఫ్రీ చంద్రముఖి :
మొక్క కొంత వరకు పాకే లక్షణాన్ని కలిగి వుంటుంది. ఆకులు వెడల్పుగా వుండి దుంప పెద్దగా గుండ్రంగా వుంటుంది. దుంప పైపొర గోధుమ రంగులో వుండి, కళ్ళు పైపైన వుంటాయి. కండ లేతపసుపు రంగులో వుంటుంది. 90-100 రోజుల్లో ఎకరాకు 10 టన్నుల దిగుబడినిస్తుంది.
కుఫ్రీ సింధూర్ :
మొక్కలు నిలువుగా, ఆకులు చిన్నవిగా వుంటాయి. దుంపలు మధ్యస్థంగా, గుండ్రంగా, కళ్ళు తక్కువగా వుండి, లోతుగా వుంటాయి. కండ లేత పసుపు రంగులో వుంటుంది. 110 రోజుల్లో కోతకు వచ్చి, ఎకరాకు 9-10 టన్నుల దిగుబడినిస్తుంది. లేట్ బ్లైట్ తెగులును తట్టుకొంటుంది. మనరాష్ట్రంలో పండించటానికి మరియు నిల్వ చేయటానికి అనువైన రకం.
పై రకాలే కాకుండా కుఫ్రీజ్యోతి, కుఫ్రీలవకర్, కుఫ్రీబహార్, సదాబహార్, చిప్ సోనా-1, 2, 3, రకాలు, కుఫ్రీ ఆనంద్, కుఫ్రీ సూర్య, 116, 117, 166, 107, ఎస్-1, ఎస్-2 స్పెషల్ సెలక్షన్స్ రకాలు కూడా మన రాష్ట్రంలో సాగులో ఉన్నాయి.
నేల తయారి :
నేలను 4-5 సార్లు దున్ని, ఎకరాకు 10-12 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్ని చదునుచేయాలి. 50 సెం.మీ. ఎడంతో బోదెలు మరియు కాలవలు చేయాలి.
త్వరగా మొలకెత్తటానికి (నిద్రావస్థను తొలగించడానికి) :
శీతల గిడ్డంగుల నిల్వ నుండి తీసిన ఆలుగడ్డ విత్తన దుంపలను త్వరితంగా మొలకెత్తించడానికి, వాటిని 30 సెం.మీ. మందం కన్నా మించకుండా నీడలో పరచి కనీసం 7-10 రోజుల పాటు ఆరనీయాలి. గాలి చొరబడడానికి 2-3 సార్లు విత్తన దుంపలను తిరగతిప్పాలి. పెద్ద సైజు దుంపలను శుభ్రంగా నీటిలో కడిగి 30-40 గ్రా. ఉండేల దుంపలను ముక్కలుగా కోయాలి. 100 గ్రా. థయోయూరియా + 10 మి.గ్రా. జిబ్బరిల్లిక్ ఆసిడ్ 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణంలో విత్తనం దుంపలను ముంచి తీసి బాగా ఆరబెట్టి, ఆ తర్వాత కుప్పగా చేసి 24-48 గంటలుంచిన తర్వాత విత్తుకుంటే మొలక శాతం బాగా ఉంటుంది. ఈ ద్రావణంలో 500 కిలోల వరకు విత్తనాన్ని శుద్ధి చేయవచ్చు.
విత్తటం :
తెగులు సోకని, ఆరోగ్యమైన దుంపలను ఎన్నిక చేసుకోవాలి. దాదాపు 30-40 గ్రా. బరువుతో, 2-3 కళ్లు వుండి, అప్పుడే మొలకెత్తటం ప్రారంభించిన వాటిని విత్తటానికి ఎంపిక చేయాలి. ముక్కలు చేసిన విత్తన దుంపలు ఎకరాకు 6 నుండి 8 క్వింటాళ్ళు అవసరం వుంటుంది. విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే శిలీంద్రాల నివారణకు విత్తనశుద్ధి తప్పని సరిగా చేయాలి. 25-50 గ్రా. బగలాల్ (మిథైల్ ఇథాక్సీ మెర్క్యురిక్ క్లోరైడ్) 10 లీ. నీటిలో కలిపిన ద్రావణంలో 2-5 ని||ల పాటు ఉంచాలి. ఒకసారి తయారుచేసిన మందు ద్రావణాన్ని మూడుసార్లు మాత్రమే విత్తన శుద్ధికి ఉపయోగించాలి. బోదెలకు ఒక ప్రక్కగా కళ్ళు పై భాగంవైపు వుండేటట్లుగా విత్తన దుంపలను నాటాలి. మొక్కల మధ్య 20 సెం.మీ., వరుసల మధ్య 50 సెం.మీ.ల ఎండం వుండాలి. లీటరు నీటికి 3 గ్రా. మాంకోజెబ్ చొప్పున తయారు చేసిన ద్రావణంలో కూడా ఈ దుంపలను సుమారు 30 నిమిషములుంచి విత్తనశుద్ధి చేసికొనాలి.
నీటి యాజమాన్యం :
నేలను, వాతావరణాన్ని దృష్టిలో వుంచుకొని నీరుపెట్టాలి. చల్కానేలల్లో, మొలకెత్తడానికి ముందు 7-8 రోజుల వ్యవధితోనూ, దుంప ఏర్పడేటపుడు 4-5 రోజుల వ్యవధితోనూ నీరు పెట్టాలి.
కలుపు నివారణ, అంతరకృషి :
అభివృద్ధి చెందుతున్న దుంపలపై సూర్యరశ్మి పడితే, దుంప ఆకుపచ్చ రంగుకు మారుతుంది. కాబట్టి విత్తిన 30 రోజుల తర్వాత షుమారు 3-4 సార్లు మట్టిని ఎగదోయాలి. విత్తిన 2-3 రోజుల్లో ఎకరాకు ఒక లీటరు అలాక్లోర్ పిచికారి చేయాలి. అలాగే 300 గ్రా. మెట్రిబుజిన్ కూడా పిచికారి చేసి కలుపు నివారించుకోవచ్చు.
ఎరువుల యాజమాన్యం :
ఆఖరి దుక్కిలో ఎకరాకు 10-12 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 40 కిలోల యూరియా, 150 కిలోల సూపర్‌ఫాస్ఫేట్, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. విత్తిన 30 రోజుల తరువాత 40 కిలోల యూరియా, 50 రోజులకు మరో 20 కిలోల యూరియా, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి
0 Comments