How to select best dairy or milch cattle

 


శరీర ఆకృతి లక్షణాలు:

శారీరక లక్షణాలకు మరియు పాల ఉత్పత్తికి కొంత సంబంధం ఉంది కనుక శారీరక లక్షణాలను బట్టి మంచి పాల సార గల పాడిపశువును ఎంపిక చేసుకోవాలి.
మనం ఎన్నుకునే పాడి పశువు దాని జాతి లక్షణాలు కలిగి ఉండాలి.
త‌ల‌చిన్న‌దిగా, ద‌వ‌డ‌లు గ‌ట్టిగా, క‌ళ్ళు పెద్ద‌విగా కాంతి వంతంగా వెడ‌ల్పాటి నుదురు క‌లిగి ఆరోగ్య వంతంగా ఉండాలి.
మెడ‌స‌న్న‌దిగా జ‌బ్బుల‌లో క‌లిసిపోయి ఉండాలి.
చ‌ర్మం ప‌లుచ‌గా, ప్రక్క టెముక‌లు ఎడంగా, గ‌జ్జలు లోతుగా ఉండాలి.

కాళ్ళు నిటారుగా బ‌లంగా కొంచెం ఎడంగా ఉండాలి.
వెనుక‌నుండి చూస్తే తొడ‌లు ఎడంగా ఉండి పొదుగుకు ఎక్కువ‌చోటు ఉండాలి.
గుండె భాగం లోతుగా, పొడ‌వుగా ఉండాలి.
పొట్టభాగం పొడ‌వుగా, లోతుగా ఉండి వెన‌క‌కు వెళ్ళే కొల‌ది వెడ‌ల్పుగా ఉండాలి.
పశువును ముందు నుండి చూసినా లేదా ప‌క్క‌నుండి చూసినా శ‌రీరం త్రికోణాకారంలో ఉండాలి.

పశువుల పాల ఉత్పత్తి లక్షణాలు:
పొదుగు పెద్దదిగా, స‌మ‌త‌లంగా శ‌రీరానికి అంటిపెట్టుకొని, వెనుక‌వైపు పై వ‌ర‌కు విస్తరించి ఉండాలి.
పాలు పితికిన‌త‌ర్వాత‌, పిత‌క‌క‌ముందు పొదుగు ప‌రిమాణంలో బాగా మార్పు ఉండాలి. పాలు పితికిన‌త‌ర్వాత‌ పొదుగు పూర్తిగా త‌గ్గిపోవాలి.
చ‌న్నులు నాలుగు ఒకే ప‌రిమాణంలో ఉండి పొదుగు మీద‌ చ‌తుర‌స్రాకారంలో అమ‌రి ఉండాలి.
చ‌న్నుల్లో మ‌రియు పొదుగులో ఎలాంటి గ‌డ్డ‌లు ఉండ‌రాదు.
చ‌న్నులు బ‌ల‌పంక‌ట్టి ఉన్నవాటిని ఎన్నుకోరాదు. అలా ఉంటే ఆ పశువుకు ముందు ఈత‌లో పొదుగు వాపు వ్యాధి వ‌చ్చిఉంటుంది.
పొదుగు మ‌రియు ఉద‌రం కింద‌ ఉండే పాల‌న‌రం పొడ‌వుగా వంక‌ర‌లు తిరిగి శాఖ‌లుగా విభ‌జింప‌బ‌డి ప్ర‌స్ఫుటంగా క‌నిపించాలి.

జాగ్రత్తలు:
పశువులు కొనేట‌పుడు అది ఎప్పుడు ఈనింది, ఎన్న‌వ ‌ఈత‌లో ఉంది, ఈనిన ‌త‌రువాత‌ ఎన్ని నెల‌లు పాడిలో ఉంది, క‌ట్టిన‌ట్ల‌యితే ఎన్ని నెల‌లు గ‌ర్భంలో ఉంది, వ‌ట్టిపోయి ఎంత‌కాలం అయింది మ‌రియు ఈన‌డానికి ఇంకా ఎంత‌కాలం ప‌డుతుంది మొద‌ల‌గు విష‌యాలు ప‌రిశీలించాలి.
మెయ్య‌వ‌చ్చే వాటిని, త‌ల్లుల‌కు అల్జ్రిక్ పొదుగు జ‌బ్బు వ‌చ్చిన‌వాటిని కొన‌రాదు.
ముందు ఈత‌లో ఈసుకుపోయిన‌ పశువుల‌ను కూడా కొన‌క‌పోవ‌డం మంచిది.

చూడి పశువుల సంరక్షణ :
1.చూడి పశువును ఈనడానికి రెండు వారాల ముందు పాలు తీయకుండా ఎండ కట్టాలి. ఇలా పాలు తీయకుండా ఆపడం ఒక్కసారి చెయ్యరాదు. మొదట రెండు పూటల నుండి ఒక్కపూటకు. తరువాత ఒక రోజు నుండి రెండు మూడు రోజులకు ఒకసారి తరువాత వారానికికొక సారి పాలు తీస్తూ ఎండ కట్టాలి. ఇలా ఎండ కట్టడం వలన పశువు ముందు ఈతలో పాల ద్వారా కోల్పోయిన పోషక పదార్ధాలను తిరిగి పొంది మరుసటి ఈతలో పాలు బాగా ఇస్తుంది.

2.చూడి చివరి మూడు మాసాలు పశువుల పోషణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే దూడ పెరుగుదల మూడింట రెండు వంతులు చివరి మూడు మాసాల్లోనే ఉంటుంది. కనుక చూడి పశువుకు తిన్నంత పచ్చి మేతకు అదనంగా 2 కిలోల దాణాను ఇవ్వాలి. 

3.ఈనడానికి రెండు వారాల ముందు గాలి, వెలుతురు బాగా ఉండే పరిశుభ్రమైన పాకలోకి మార్చాలి. నేల ఎగుడుదిగుడులు లేకుండా చదును గా చేసి పొడిగడ్డితో కప్పి ఉంచాలి. 

4.చూడి పశువుకు మెయ్యకనిపించడం జరిగితే నేల వెనుక భాగం ముందు భాగం కంటే ఎత్తుగా ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి. ఇలాంటి పశువులకు సులభంగా జీర్ణమయ్యే మేత, దాణా ఇవ్వాలి. పశువు ఈనిన తరువాత 8 గంటలలోపు మాయ పడనట్లయితే పశువైద్యుని సంప్రదించాలి.

దూడల సంరక్షణ :
దూడల సంరక్షణ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి మొదలు కావాలి. అంటే చూడి పశువులను బాగా మేపి నట్లయితే ఆరోగ్యవంతమైన ఎక్కువ బరువు కలిగిన దూడ పుడుతుంది. దూడ పుట్టిన వెంటనే ముక్కులో ఉన్న జిగురు పదార్ధాన్ని తుడిచివేయాలి. వంటి మీద ఉన్న జిగురు పదార్ధాన్ని తల్లి నాకనట్లయితే పొడి బట్టతో శుభ్రంగా తుడవాలి. బొడ్దును శరీరానికి రెండంగుళాల దిగువన దారంతో కట్టి ముడి దిగువ భాగంలో తుప్పుపట్టని కత్తెరతో కత్తిరించి టించరు అద్దాలి. ఇలా చేయడం వలన చీము పట్టడం జరగదు. 

పుట్టిన అరగంటలోపు దూడకు జున్నుపాలు త్రాగించాలి. జున్ను పాలలోని వ్యాధి నిరోధక ఆంటిబాడీలు దూడలను వివిధ వ్యాధుల బారి నుండి కాపాడతాయి. జున్నుపాలలో విటమిన్ 'ఎ' మరియు ఖనిజలవణాలు మామూలు పాల కంటే 3 రెట్లు ఎక్కువగా ఉండి దూడలకు చాలా బలవర్ధకమైన ఆహారంగా పనిచేస్తాయి. దూడలకు మొదటిసారి విరేచనం కావడానికి కుడా జున్నుదోహదం చేస్తుంది. ఒకవేళ ఏదేని కారణం చేత తల్లి జున్ను పాలు దూడకు లభించనట్లయితే ఒక కోడిగుడ్డు, అర టీస్పూన్ ఆముదం, 600 మి.లీ. పాలు, 10,000 ఐ.యు విటమిన్ 'ఎ',80 మి.గ్రా. ఆరియోమైసిన్ పొడి కలిపిన మిశ్రమాన్ని దూడకు ఇవ్వాలి. గాలి కుంటు వ్యాధితో బాధపడుతున్న పశువుకు జన్మించిన దూడకు తల్లి జున్ను పాలు త్రాగించ కూడదు. వేరొక పశువు జున్ను పాలుగాని లేదా పైన పేర్కొన్న మిశ్రమాన్ని గాని ఇవ్వవచ్చు. 

ఇలా పెంచిన దూడ ప్రతిరోజు 400-450 గ్రా. పెరిగి రెండు సంవత్సరాల కాలంలో 200-250 కిలోల బరువు పెరిగి కట్టడానికి తయారవుతుంది. ఈ విధమైన పోషణకు 4 వేల ఖర్చయితే, మనకు 15 వేల నుండి 16 వేల విలువైన పాడి పశువు తయారవుతుంది.

దూడల ఆరోగ్యపరిరక్షణ :
దూడ పుట్టిన మొదటి రోజు పేడ వెయ్యకపోతే 1/4 లీటరు మజ్జిగలో 100 గ్రా. ఆముదం కలిపి ఇవ్వాలి. లేదా కోడి గుడ్డుసొన, ఇంగువ, బెల్లం పాలలో కలిపి త్రాగిస్తే మలబద్దకం పోతుంది. దూడలను రెండు నెలల వరకు విడివిడిగా చదునైన నేల మీద పొడి గడ్డిని పరచి పెంచాలి.
న్యూమోనియా రాకుండేందుకు వర్షాకాలం మరియు చలికాలంలో షెడ్డు చుట్టూ పట్టాలు కట్టాలి. కాక్సీడియోసిన్ రాకుండా ఉండేందుకు దూడల పాక చుట్టూ 15 రోజుల కొకసారి పొడిసున్నం చల్లాలి.

మొదటి 7వ రోజు తర్వాత ప్రతి 20 రోజులకోసారి పైపర్ జిన్ ఎడిపేట్ మందును కిలో బరువు దూడకు 200-400 మి.గ్రా. చొప్పున త్రాగించినట్లైతే ఏలికపాముల బారి నుండి రక్షించవచ్చు.

వీనింగ్ పద్ధతి ద్వారా పెంచే దూడలకు పాలు పితికిన వెంటనే గోరు వెచ్చగా చేసి రోజు ఒకే సమయంలో దూడ శరీర బరువును బట్టి పట్టించాలి. అలాగే పాల పాత్రలు కూడా ప్రతి రోజు పరిశుభ్రంగా కడిగి ఎండబెట్టినట్లయితే పారుడు వ్యాధిని అరికట్టవచ్చు.

దూడలకు పిడుదులు, పేలు, గోమార్లు ఆశ్రయించకుండా నెలకొకసారి ఎక్టోడిక్స్ ద్రావణం 3-4 మి.లీ. లీటరు నీటికి కలిపి దూడల శరీరంపై పిచికారి చేయాలి. 

Post a Comment

0 Comments