మన రాష్ట్రంలో ఆకు కూరలన్నీ కలిపి ప్రస్తుతం సుమారుగా 16,740 ఎకరాలలో సాగుచేయబడి, 36,823 టన్నుల దిగుబడినిస్తున్నాయి. ఆకు కూరలు సమీకృత పోషకాహారంలో చాలా ముఖ్యమైన భాగం. ఇందులో అధికంగా లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు వున్నాయి.
మనం పండించే ఆకుకూరల్లో తోటకూర ముఖ్యమైనది. వివిధ శీతోష్ణ పరిస్థితుల్లో పెంచటానికి అనువైనది. నీటి ఎద్దడిని తట్టుకొంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత 15 సెల్సియస్ కంటే తక్కువ వుంటే పెరుగుదల సరిగా వుండదు.
నేలలు:
ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలం. ఉదజని సూచి 6.0 - 7.0 వున్న నేలలు అనుకూలం.
నీరు నిలిచే బంకమట్టి నేలలు మరియు ఇసుక నేలలు పనికిరావు. నేలను 4 - 5 సార్లు బాగా దుక్కిదున్నాలి.
ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేయాలి. మళ్ళను బాగా చదునుగా చేసుకోవాలి.
విత్తనాలు:
పంటకాలం :వర్షాకాలం : జూన్ నుండి అక్టోబరు; వేసవికాలం : జనవరి మే.
విత్తటం :2 X1.5 మీ. మడుల్లో పలుచగా విత్తుకోవాలి. ఎకరాకు 800 గ్రాముల చొప్పున విత్తనం అవసరమవుతుంది.విత్తనం వేసేటప్పుడు 10 రెట్లు సన్నటి ఇసుకతో కలిపి వేయాలి. నారుమడిలో పోసుకొని కూడా 20 X 20 సెం.మీ. దూరంలో నాటుకోవచ్చు. ఈ విధంగా చేస్తే 1 కిలో విత్తనం సరిపోతుంది. విత్తనం వెదజల్లితే ఎకరాకు 2 కిలోల విత్తనం కావాలి.
రకాలు:
ఆర్.ఎన్.ఎ. 1:
ఆకులు మరియు కాండం లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ రకంలో విటమిన్ 'ఎ','సి'లు అధికంగా ఉండటమే గాక కాండం కూడా పీచు లేకుండా చాలా మృదువుగా ఉండి, రుచికరంగా ఉంటుంది.
నెలరోజుల్లో ఒక ఎకరాకు 6-7 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. మొదటి కోత విత్తిన 15 - 20 రోజులకు వస్తుంది.కోత తరువాత బాగా శాఖలు విస్తరిస్తాయి. నీటి ఎద్దడి, తెల్ల ఆకుమచ్చ తెగులును తట్టుకొని అధిక దిగుబడి నిస్తుంది.
ఆంద్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ మరియు వేసవి కాలంలో పండించేందుకు అనువైనది.
కో 1 :
ఆకులు మరియు కాండం లావుగా వుండి కండ కలిగి వుంటాయి. ఒక ఎకరానికి 3- 3.5 టన్నుల దిగుబడిని 25 రోజులలో ఇస్తుంది.ఆకులు వెడల్పుగా ముదురు ఆకుపచ్చ రంగుతో ఉంటాయి. విత్తనాలు చిన్నవిగా, నల్లగా ఉంటాయి.
కో 2 :
ఆకులు కోలగ, ముదురు ఆకుపచ్చ రంగులో పొడవుగా వుంటాయి. కాండం లేతగ, మృదువుగా వుంటుంది.విత్తిన 30 రోజులకు కోతకు వస్తుంది. కాండం కూడ కూరగా పనికి వస్తుంది.ఎకరాకు 4-5 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. విత్తనాలు పెద్దవిగా, నల్లగా వుంటాయి.
పూసా చోటి చౌలై :
మొక్కలు పొట్టిగా, ఆకులు చిన్నవిగా వుంటాయి. కోతరకం.
పూసాబడి చౌలై :
మొక్కలు పొడవుగా, కాండం లావుగా లేతగా వుండి, ఆకులు పెద్దవిగా వుంటాయి.
సిరికూర :
మొక్కలు పొట్టిగ, ఆకులు చిన్నవిగ వుంటాయి. కాండం, వేరు కలిసే చోట గులాబిరంగులో వుంటుంది.నాటిన 25 రోజులకు లేత మొక్కలను కాండంతో సహా కూరగా వాడుకొనవచ్చు.
పై రకాలే కాకుండా పూసాకీర్తి, పూసాకిరణ్, పూసాలాల్ చౌలై, అర్క సుగుణ, అర్క అరుణ (ఎర్ర తోటకూర) రకాలను కూడా సాగుచేయవచ్చు.
ఎరువులు :
ఎకరాకు 20 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ల నిచ్చే ఎరువులను వేసి బాగా కలియదున్నాలి. కత్తిరింపులు తీసుకునే రకాలకు ఎకరాకు 30 కిలోల నత్రజనిని మూడు భాగాలుగా చేసి ప్రతి కత్తిరింపు తర్వాత నత్రజనిని వేసి నీరు పెట్టాలి.
విత్తిన 15 - 20 రోజుల తర్వాత 2% (20గ్రా. లీటరు నీటికి) యూరియా + 20 పి.పి.యమ్ (50 మి.గ్రా. లీటరు నీటికి) జిబ్బరెల్లిక్ ఆసిడ్ కలిపిన ద్రావణం పిచికారి చేస్తే అధిక లాభాలు పొందవచ్చు. అంతేకాక 25% నత్రజని ఆదా అవుతుంది.
కలుపు నివారణ, అంతరకృషి :
కలుపు నివారణకు ఎకరాకు డ్యుయల్ (మెటలాక్లోర్) మందును తేలిక నేలలకు ఒక లీటరు లేదా బరువు నేలలకు 1.5 లీ. చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని విత్తిన/నాటిన 24 - 48 గంటలలో భూమిపై పిచికారి చేయాలి.
నీటి యాజమాన్యం :
భూమిలో తేమను బట్టి 7 - 10 రోజుల వ్యవధితో నీరు కట్టాలి. వేసవిలో ప్రతి 5 - 6 రోజులకు ఒక తడిని ఇవ్వాలి.
దిగుబడి :కోత రకాలలో విత్తిన 25 రోజులకు మొదటి సారిగా తరువాత ప్రతి వారం నుండి 10 రోజులకు ఒక కోత చొప్పున 90 రోజులలో 4 - 5 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.మొక్కను వేర్లతో సహా పీకి కట్టలు కట్టే రకాలలో 3 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
.
సస్యరక్షణ :
తెల్లమచ్చ తెగులు :
ఆకుల అడుగు భాగాన తెల్లటి బుడిపెల వంటివి ఏర్పడతాయి. ఆకు పైభాగాన లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి, పండుబారి ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్ మందును కలిపి పిచికారి చేయాలి. ఆకుల అడుగు భాగం బాగా తడిచేలా చూడాలి.
ఆకులను తినే గొంగళి పురుగులు :
చిన్న, పెద్ద పురుగులు ఆకులను కొరికి వేయడం వలన ఆకులు పనికి రాకుండా పోవడమేగాక, మార్కెట్ లో సరైన రేటురాదు. వీటి నివారణకు మలాధియాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పిచికారి చేసిన తర్వాత కనీసం 10 రోజుల వ్యవధి ఇచ్చి ఆకుకోయాలి.
0 Comments