Best economic crop Rose Flower techniques

 పూలల్లో గులాబిని రాణి పువ్వుగా పిలుస్తారు. గులాబీ పూలనుంచి సుగంధ తైలం మరియు పువ్వు రెక్కలతో గులఖండ్ అనే పదార్ధం కూడా తయారు చేస్తారు. సూర్యరశ్మి బాగా కలిగిన వాతావరణం అనువైనది. 


ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు పూల దిగుబడి నాణ్యతపై మిక్కిలి ప్రభావం చూపుతాయి. పగటి ఉష్ణోగ్రత 30 సెల్సియస్ మరియు రాత్రి 15 సెల్సియస్ అనుకూలం 18 సెల్సియస్ వద్ద గులాబీలలో రంగు అభివృద్ధి చాలా బాగుంటుంది. 


గులాబీలను నీడపడకుండ వుండే ప్రదేశాల్లో పెంచాలి. నీడ ఎక్కువగా వున్నట్లైతే తెగుళ్ళ బెడద ముఖ్యంగ బూడిద తెగులు ఎక్కువగా వుంటుంది. అంతే కాకుండా మొక్కలు సన్నగా, బలహీనంగా వుంటాయి. 


నేలలు: 

తేలిక నేలలు అనువైనవి. నేల ఉదజని సూచిక 6.5 7.5 వుంటే మంచిది. బరువైన నీరు ఇంకని నల్లనేలలు గులాబి సాగుకు అనుకూలం కాదు. 

* నాటే దూరం : నేల స్వభావాన్ని మరియు రకాన్ని బట్టి 75-120 సెం.మీ. ఎడంగా నాటాలి. ఎకరాకు 6000 నుండి 7000 మొక్కలు అవసరమవుతాయి. 


* నాటే సమయం : గులాబీ మొక్కలను జూన్ నుంచి జనవరి వరకు నాటుకోవచ్చు. అయితే సెప్టెంబరు -అక్టోబరు మాసాల్లో నాటడం మంచిది. 


ప్రవర్ధనం: 

శాఖీయంగా కొమ్మ కత్తిరింపులు, బడ్డింగ్ ద్వారా ప్రవర్ధనం చేస్తారు. వాణిజ్య సరళిలో టీ బడ్డింగ్ ద్వారా ప్రవర్ధనం చేస్తారు. బడ్డింగ్ చేయటానికి ఎంపిక చేసుకొన్న గులాబీ బడ్ ను రూట్ స్టాక్ మొక్కపై భూమి నుంచి షుమారు 10-15 సెం.మీ. ఎత్తున వుండేటట్లు బడ్దింగ్ చేయుట మంచిది. 


రకాలు: 

సాగులోనున్న గులాబీలను ఈ క్రింది విధంగా విభజించవచ్చు.

* హైబ్రిడ్ టీస్ : మొక్కలు పెద్ద గులాబీలను కొమ్మకు ఒక్కటిగా పూస్తాయి.ఉదా: గ్లాడియేటర్, కార్డినాల్, ఎటర్న,పింకిపీస్.

* ఫ్లోరిబండాస్ : గులాబీలు మధ్యంతర సైజులో గుత్తులుగా పూసి ఎక్కువ రోజులుంటాయి.ఉదా: ల్యూటిన్,రెడ్ ట్రెంప్, వీపింగ్ చైనాడాల్.

* మీనియేచర్ : మొక్కలు చిన్నవిగా, చిన్న ఆకులు కలిగి అతిచిన్న పూలను పూస్తాయి.ఉదా : పింక్ స్ప్రే, నర్తకి, ప్రీతి.

* పాలియాంతాస్ : చిన్న చిన్న పూలు వేసవిలో పూస్తాయి. మొక్కలు హెడ్డింగ్ కు అనువైనవి.

* తీగ గులాబీలు : మొక్కలు తీగలుగా పెరిగి పూలు చిన్నవిగా, గుత్తులుగా పూస్తాయి. 


ఎరువులు: 

కొమ్మలను కత్తిరించిన తర్వాత ప్రతి మొక్కకు 7-8 కిలోల పశువుల ఎరువు మరియు 3 నుండి 5 కిలోల వేరుశనగ/వేపపిండి చెక్కను వేయాలి. 


తదుపరి 15 లేక 20 రోజుల పిమ్మట నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను 1:8:3 నిష్పత్తిలో ప్రతి మొక్కకు 100 గ్రా. చొప్పున వేయాలి. ఇదే మోతాదును రెండు, మూడు తడవులుగా వేయాలి. 


సూక్ష్మ ధాతువులయిన మాంగనీస్ సల్ఫేట్ 15 గ్రా., మెగ్నీషియం సల్ఫేట్ 20 గ్రా., ఛిలేటెడ్ ఇనుము 10గ్రా., బోరాక్స్ 5 గ్రా. కలిగిన మిశ్రమాన్ని 2 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. 


నీటి యాజమాన్యం: 

మొక్కలను నాటిన తర్వాత కొత్త చిగుళ్ళు వచ్చే వరకు తేలిక పాటి నీటి తడులను యిచ్చి,అటుపిమ్మట అవసరాన్ని బట్టి 8-10 రోజుల వ్యవధితో నీటి తడులు ఇవ్వాలి. డ్రిప్ పద్ధతి ద్వారా కూడా నీటి యాజమాన్యం చేబట్టి నీటిని ఆదాచేయవచ్చు. 


సస్యరక్షణ‌ - పురుగులు: 

* పెంకు పురుగులు : రాత్రిపూట ఆకులను వంకరటింకరగా కొరికి తినివేస్తాయి. నివారణకు 15 కిలోలు మాలాధియాన్ 5 శాతం పొడిని సాయంత్రం సమయంలో చల్లాలి. 


* పేను : ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా వున్నచో ఆకుల కొనలు మరియు మొగ్గ నల్లగా మారుతాయి. నివారణకు డైమిధోయేట్ 2 మి.లీ. లేదా మొనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లీట‌రు నీటికి క‌లిపి పిచికారి చేయాలి. 


* ఎర్రనల్లి : వాతవరణం వేడిగా ఉన్న రోజుల్లో ఉధృతంగా ఉంటుంది. దీనివలన మొక్క ఆకులు మొత్తం రాలిపోతాయి. నివారణకు 3 గ్రా. నీటిలో కరుగు గంధకం లేదా డైకోఫాల్ 5 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. 


సస్యరక్షణ‌ - తెగుళ్ళు: 

* బూడిద తెగులు : ఆకులపై బూడిదవంటి తెల్లటి పదార్ధ‌మేర్పడి ఆకులు ముడుచుకొనిపోతాయి. లేత కొమ్మల నిండా బూడిద సోకి ఎండిపోతాయి. పూల రేకులు రంగు మారి వడలి, ఎండిపోతాయి. నివారణకు డైనోకాప్ 1 మి.లీ. లేదా కార్బండైజిమ్ 1.0 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి నివారించవచ్చు. 


* నల్లమచ్చలు : గుండ్రటి నల్లటి మచ్చలు ఆకులకు రెండు ప్రక్కలా వ్యాపించడం వల్ల ఆకులు రాలిపోతాయి. వర్షాకాలంలో ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. నివారణకు కాష్టాను 2 గ్రా. లేదా మాంకోజెట్ 2 గ్రా. లేదా కార్బండజిమ్ 1 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. 


* ఎండురోగం : మొక్క పైభాగం నుండి క్రిందకు ఎండిపోతుంది. ఈ తెగులు ముందుగా కత్తిరించిన కొమ్మనుండి మొదలవుతుంది. తెగులు సోకిన కొమ్మలు నలుపు రంగుకు మారుతాయి. కాండం, వేర్లు గోధుమ రంగుకు మారిపోతాయి. నివారణకు ప్రూనింగు చేసిన (కత్తిరింపు) కొమ్మకు వెంటనే రాగి ధాతు సంబంధమైన మందును (బ్లైటాక్స్) పేస్ట్ లాగా చేసి కత్తిరించిన ప్రదేశాల్లో పూయాలి లేదా పచ్చిపేడ మరియు మట్టితో కలిపిన పేస్టుపూసి కూడా ఈ తెగులును కొంతవరకు నివారించవచ్చు. 


పూత దిగుబడి: 

గులాబీపూలు క్రొత్త చిగుర్లపైన పూస్తాయి. కాబట్టి కొమ్మ కత్తిరింపులు తప్పని సరిగా చేయాలి. సంవత్సరానికి ఒకసారి అంటే మన రాష్ట్రంలో వర్షాకాలం అయిపోయిన తరువాత అక్టోబరు నవంబరు మాసాల్లో కొమ్మ కత్తిరింపులు చేయుటకు అనుకూలం. 


కొమ్మలను కత్తిరించునపుడు చనిపోయిన, ఎండిపోయిన కొమ్మలను, తెగులు లేక పురుగు ఆశించిన కొమ్మలను, బలహీనంగా వున్న కొమ్మలను, రూటుస్టాక్ పైన వచ్చే చిరుగును, కొమ్మలను వెంటనే కత్తిరించాలి. 


ఆరోగ్యంగా, బలంగా వున్న కొమ్మలపై తగినంత ఎత్తులో వెలుపలి వైపు వున్న మొగ్గకు షుమారు 5 మి.మీ. పైన పదునైన సికేచరుతో కొమ్మలను కత్తిరించాలి. వాణిజ్యపరంగ సాగుచేసిన గులాబీలు నాటిన 2వ సం" తర్వాత మొదలై 7-8 సంవత్సరాల వరకు పూస్తాయి. 3 సంవత్సరాల మొక్క 300 గులాబీల వరకు పూస్తుంది. మార్కెట్ కొరకు పూర్తిగా కాకుండ‌ గులాబీలు సగంగా విచ్చుకొనపుడు కోయాలి. 

Post a Comment

0 Comments